ఈ ప్యానెల్ కనిపించే పని , కనిపించని మహిళలు అనే ఛాయాచిత్ర ప్రదర్శన (ఫోటో ఎగ్జిబిషన్) లో భాగంగా ఉంది . ఈ ప్రదర్శన గ్రామీణప్రాంతాలలో మహిళలు చేసే ఉన్నతస్థాయి పనిని వర్ణించే ఫోటోల ఎగ్జిబిషన్ . ఇందులోని ఛాయాచిత్రాలను పి . సాయినాథ్ 1993 నుండి 2002 మధ్యకాలంలో 10 భారతీయ రాష్ట్రాలలో పర్యటించి , తీశారు . అనేక సంవత్సరాల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రదర్శించబడిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ ‌ ను , PARI సృజనాత్మకంగా డిజిటలైజ్ చేసింది.

పశువులు ఇంటికి వచ్చేంత వరకూ…

బిహార్‌ మహిళలు, వారి పిడకల తయారీ ద్వారా దేశ ఆర్థికవ్యవస్ధలో బ్రహ్మాండంగా పాల్గొంటున్నారు. కాకపోతే దానికి జీడీపీ అంకెల్లో చోటు దక్కదు. పశువుల పేడను ఇంధనంగా వాడుతున్న లక్షలాది కుటుంబాలు శిలాజ ఇంధనాలవైపు గనక మళ్లితే, అదొక మహా విపత్తే. భారతదేశం విదేశీ మారకద్రవ్యాన్ని, అన్ని దిగుమతుల కన్నా ఎక్కువగా పెట్రోలియం, తదితర ఉత్పత్తుల దిగుమతుల కోసం ఖర్చు చేస్తుంది. 1991-2000 సంవత్సరంలో ఈ ఖర్చు మొత్తం రూ. 47,421 కోట్లు.

మనం ఆహారం, వంటనూనెలు, ఔషధాలు, ఫార్మా ఉత్పత్తులు, రసాయనాలు, ఇనుము, ఉక్కు దిగుమతులకు ఖర్చు చేసే మొత్తంకన్నా ఇది మూడింతలు ఎక్కువ. మనం పెట్రోలియం, తదితర ఉత్పత్తుల కోసం ఖర్చు చేసే డబ్బు మొత్తం దిగుమతుల బిల్లులో నాలుగో వంతు ఉంటుంది.

మనం ఎరువుల దిగుమతుల కోసం ఖర్చు చేసే 1.4 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యానికి ఇది దాదాపు ఎనిమిది రెట్లు. కోట్లాది మంది పంటల సాగులో వాడే పేడ ఓ ప్రధానమైన ఆర్గానిక్ ఎరువు. కాబట్టి అలా కూడా ఇది మనకు బోలెడంత డబ్బును ఆదా చేస్తుంది. అది కీటనివారిణిలా కూడా ఉపయోగపడుతుంది. ఎలా చూసినా పేడతో చాలా ఉపయోగాలే ఉన్నాయి. పేడ సేకరణ కూడా ‘మహిళల పనే.’ ఈ పని ద్వారా మహిళలు దేశానికి ఏటా కోట్లాది రూపాయల్ని, బహుశా కొన్ని బిలియన్ల డాలర్లను ఆదా చేస్తున్నారు. కానీ పేడ స్టాక్ మార్కెట్లో నమోదు కాలేదు కాబట్టి, అలాగే దీన్ని సేకరించే మహిళల జీవితాల గురించి వారికి ఏమీ తెలియకపోవడం వల్లనో లేదా పట్టించుకోకపోవడం వల్లనో, ప్రధానస్రవంతి ఆర్థికవేత్తలు దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి శ్రమను వారు చూడరు లేదా గౌరవించరని అనుకోవచ్చు.

వీడియో చూడండి : ‘ఆమె అలా నడుం వంచి పని చేయడాన్ని చూస్తే, తన వెన్నుపైన పైకప్పును మోస్తున్నట్టుగా కనిపిస్తోంది’

ఆవులకు, గేదెలకు అవసరమైన మేతను మహిళలు సేకరిస్తారు. పేడను ఊక, చిదుకులతో కలిపి పిడకలుగా చేసి ఎండబెట్టి, వాటిని వంటకు కావల్సిన ఇంధనంగా వాడతారు. ఇదంతా కూడా వారి సొంత శ్రమతోనే, ఇంతకంటే వారికి వేరే అవకాశం కూడా లేదు. పేడను సేకరించడం, దాన్ని ఉపయోగించడం కూడా శ్రమతో కూడుకున్న పనే.

ప్రపంచంలోనే అతి పెద్ద పాల ఉత్పత్తిదారుగా భారత దేశం స్థానంపొందడంలో కోట్లాది మంది మహిళల పాత్ర చాలా ముఖ్యమైంది. దేశంలోని 10 కోట్ల ఆవులు, గేదెల పాలను పితకడంలో మహిళలదే ప్రధాన పాత్ర కావడం ఒక్కటే దీనికి కారణం కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన ఈ మహిళకు ఆవు పాలు పితకడం అనేది తన పనిలో ఒక చిన్న భాగం మాత్రమే. ఆమె ఆవు కోసం మేతను సేకరిస్తుంది. తినిపిస్తుంది. దాన్ని కడుగుతుంది. ఆవులుండే గొడ్లచావిడిని శుభ్రం చేస్తుంది. పేడను పోగు చేస్తుంది. ఆమె పొరుగింటి మహిళ అప్పటికే ఆవుపాలతో మిల్క్ సొసైటీకి చేరుకొని, అక్కడ లావాదేవీలన్నీ చూసుకుంటుంది. డెయిరీ రంగంలో పని చేస్తున్న మహిళలు 69 నుంచి 93 శాతం వరకు ఉంటారని అంచనా. పాల ఉత్పత్తుల ప్రాసెసింగ్‌లో ఎక్కువ పనులు వారే చేస్తారు. నిజానికి అన్ని రకాల పశువుల నిర్వహణ, ఉత్పత్తి పనుల్లో ప్రధాన పాత్ర పోషించేది మహిళలే.

PHOTO • P. Sainath

మరొక పొరుగింటి మహిళ తన గేదెను పొలాల్లోంచి ఇంటికి తీసుకొస్తోంది (కవర్ ఫొటో). అక్కడున్న కుక్కను చూసి గేదె బెదిరిపోతోంది. ఆ గేదెకన్నా ఎంతో చిన్నదైన కుక్క గేదె కాళ్లను కరుద్దామని చూస్తోంది. ఆ మహిళ రెండింటినీ చూసింది. అయితే దేన్ని ఎలా అదుపు చేయాలో ఆమెకు బాగా తెలుసు. ఆమె రోజూ గేదెను సురక్షితంగా ఇంటికి తీసుకొస్తుంది. అది ఆమెకు నిత్యజీవితంలో భాగంగా ఉన్నదే.

పశువుల నుంచి జనాలకు కేవలం పాలు లేదా మాంసాన్ని అమ్మడం ద్వారా మాత్రమే ఆదాయం రాదు. కోట్లాది మంది నిరుపేద భారతీయులకు పశువులు కీలకమైన బీమా రక్షణ లాగా పని చేస్తాయి. సంక్షోభ సమయాల్లో, ఆదాయ వనరులన్నీ వట్టిపోయినప్పుడు, పేదలు తమ పశుసంపదలోంచి లేదా ఇతర పెంపుడు జంతువుల్లోంచి ఒకటో రెండో అమ్ముకొని పొట్టపోసుకుంటారు. కాబట్టి అనేక మంది నిరుపేద భారతీయుల సంక్షేమం ఈ దేశపు పశువుల ఆరోగ్యంతో కూడా ముడిపడి ఉంది. పశుసంపద ఆరోగ్యం మహిళల చేతుల్లో ఉంటుంది. అయినా , కొందరు మహిళలు మాత్రమే పశుసంపదకు యజమానులుగా, నిర్వాహకులుగా గుర్తింపుపొందుతారు. దేశంలోని 70 వేల పైచిలుకు గ్రామస్థాయి డెయిరీ సహకార సంఘాలపై మగవాళ్ల ఆధిపత్యమే ఎక్కువ. సొసైటీ సభ్యుల్లో కేవలం 18 శాతం మంది మాత్రమే మహిళలు. ఇక జిల్లా కోఆపరేటివ్ బోర్డు సభ్యుల్లోనైతే వారి శాతం 3 శాతానికన్నా తక్కువే.

PHOTO • P. Sainath

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli